21. బ్రహ్మాండముల చమత్కారం
శ్రీ వసిష్టమహర్షి : ఈ 'జగత్తులు' అనబడునవన్నీ చిదాకాశము కంటే వేరు కాదు. కాని, అజ్ఞానుల దృష్టికి స్వకల్పనా కారణంగా అట్లు పదార్థజాలానుభవంలో ప్రాప్తిస్తున్నాయి. వారి అనుభవమును దృష్టిలో పెట్టుకొనే ఇదంతా చెప్పాను. అజ్ఞానము చేతనే ఈ జగత్తులు ఉత్పన్నమై నశిస్తున్నాయి. దీనికి మనకు దృష్టాంతము బాలుని చిత్తము యొక్క కల్పనా వ్యవహారమే. ఆటబొమ్మలలో "ఇది పెళ్ళికూతురు, ఇది పెళ్ళికొడుకు" వంటి వివాహాది కల్పనల్ని కల్పించి బాలుడు అదంతా వాస్తవమువలె క్రీడించుచున్నాడు కదా! ఈ బ్రహ్మాండముల సృష్టి స్థితి లయాలు కూడా అట్టివే. అవి కల్పనయందే ఉద్భవించి, కల్పన చేతనే నశిస్తున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ "ఊర్ధ్వ-అధో - తిర్యక్ పైన క్రింద-వెనుక)" కల్పనలు, ఈ బ్రహ్మాండములు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇవన్నీ అధిష్ఠానమగు బ్రహ్మము నందు స్వతహాగా ఉన్నవి కావు కదా! కాని బ్రహ్మాండములోకి ఈ పైన క్రింద వెనుక ముందు కల్పనలు వచ్చిపడు. చున్నాయే? ఈ బ్రహ్మాండముల గురించి మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి రేచీకటి దోషం ఉన్న కన్నులు కలవానికి ఆకాశంలో జడలు కనిపిస్తాయి. చూచావా? అవిద్య యందున్న వానికి నాశరహితమగు పరబ్రహ్మము నందు ఈ బ్రహ్మాండములన్నీ అగుపిస్తున్నాయి.
పదార్ధములన్నీ ఈశ్వరేచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తున్నాయి. అంతేకాని, వాటికి ఎట్టి స్వాతంత్ర్యం లేదు. ఈ మన బ్రహ్మాండంలో పార్థివ (స్థూల) భాగము క్రిందకు, ఆకాశం పైన ఉన్నాయి. జ్యోతిశ్చక్రమును దర్శించునట్టి మహాపండితులు, "ఈ బ్రహ్మాండము ఆకాశమున ఉన్నట్టి మట్టి-ముద్ద వంటిది. దశదిక్కులు దీని 'కాళ్ళు' వంటివి. ఒక చీమ యొక్క దేహంవలె దీని క్రింది భాగంలో భూమండలం ఉన్నది" అని వర్ణిస్తున్నారు.
కొన్ని-కొన్ని బ్రహ్మాండభూములలో మనుష్యులు లేరు. చెట్టు-పుట్టలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఆకాశభాగంలో మాత్రం దేవతలు, కిన్నెరలు ఉన్నారు. మరికొన్ని బ్రహ్మాండములు అప్పటికప్పుడు కల్పించబడినట్టి ప్రాణసమూహములతో, గ్రామములతో, పురములతో, పర్వతములతో ఉత్పన్నములౌతున్నాయి. ఇవన్నీ చిదాకాశము నందే ఉంటూ, అందులోనే లీనమౌతున్నాయి. మంచుగడ్డలు అనేక ఆకారములు సంతరించుకొంటున్నప్పటికీ స్వతహాగా అంతా జలమే కదా! "ఈ స్పష్ట = వస్తువులన్నిటికీ ఆత్మవస్తువే కారణం" అని చెప్పబడుతోంది. అదియే అంతా అయివున్నది.
శుద్ధబోధమయమైన చిదాకాశసముద్రంలో "బ్రహ్మాండములు" అనే తరంగాలు నిరంతరం లేస్తున్నాయి. మరల అందులోనే లీనమగుచున్నాయి. భవిష్యత్తులో కూడా అనేక బ్రహ్మాండ తరంగాలు లేవబోతున్నాయి. అందులో కొన్ని "సంకల్పరాహిత్యం చేత, 'అంధకార' స్వరూపములై శూన్యమునందు. నిద్రిస్తూ ఉన్నాయి" అని అనుమానించబడుతోంది. కొన్ని కొన్ని బ్రహ్మాండతరంగాలు కల్పాంత
సూచకమైన ధ్వనులు చేస్తున్నప్పటికీ, విషయరస మోహితులైన ఆ బ్రహ్మాండములందలి జీవులు చెవులకు అవేమీ వినిపించటం లేదు. వారి బుద్ధికి ఏదీ గోచరించటం లేదు.
కొన్ని బ్రహ్మాండములు అప్పుడే ఉద్భవిస్తూ ఉండగా వాటిలో మొట్టమొదటి విశుద్ధములైన జీవసమూహములు లేచుచున్నాయి. మరికొన్ని బ్రహ్మాండములలో మహాప్రళయ సమయం ఆసన్న మగుట చేత సూర్య-చంద్ర నక్షత్రాదులు భూమిని దగ్ధం చేస్తున్నాయి. భూమి కరిగిపోతోంది. కొన్నిటికి పట్టుకొమ్మ దొరక్క పడిపోతున్నాయి. మరికొన్నిటి యందు లేవవలెననే ఆశ కూడా కలిగియుండటం లేదు. “అట్లు బ్రహ్మాండములు కూలిపోవటం ఎట్లా సంభవం?” అని అనుమానించ వలసిన పనిలేదు. ఇవన్నీ చిద్రూపములే కదా! కనుక బ్రహ్మాండములయొక్క ఉత్పత్తి పతనాలు తప్పకుండా జరుగుచున్న విషయాలే.
కొన్నికొన్ని స్తబ్ధములై ఉన్నాయి. వాయువునందు స్పందము (లేక ప్రసరణ) ఉదయిస్తున్నట్లు "చిత్అతత్త్వము" (Knowledge consciousness) నందు పైన చెప్పిన కల్పనలన్నీ ఉదయిస్తున్నాయి. అయితే, ఈ బ్రహ్మాండముల నిజస్వరూపమేమిటి? చెపుతాను. విను. పూర్వపూర్వ జన్మలందు ఆచరించబడిన జ్ఞానకర్మాదుల అనుష్టానంచేత ఒకానొక ద్రష్ట (లేక జీవుడు) సంకల్పమాత్రంచేత సృష్టిని నిర్మించగల సామర్ధ్యం పొందుచున్నాడు. అట్లు "ప్రజాపతి" అయినట్టి ఒకానొకనిచే ఈ బ్రహ్మాండములు నిర్మించబడుచున్నాయి. తత్కారణంగా ఈ కల్పమున ఉన్న సృష్టికి, ముందు ముందు రాబోయే కల్పములందు ఏర్పడబోయే సృష్టులకు భేదం ఉంటే ఉండవచ్చు. ఈ విషయం శాస్త్రాలు కూడా అంగీకరిస్తున్నాయి.
కొన్ని బ్రహ్మాండములు బ్రహ్మదేవుడు రచించాడు. మరికొన్నిటిని విష్ణువు కల్పించాడు. ఇంకొన్నిటిని ప్రజాపతులు రచిస్తున్నారు. కొన్నింటికి కర్తయే లేదు. అందుచేత అవి వృక్షాదులతో మాత్రమే ఉన్నాయి. అందు బుద్ధిజీవులు లేరు. కొన్ని బ్రహ్మాండములు కొందరు కలిసి విచిత్రంగా సృష్టిస్తున్నారు. కొన్ని బ్రహ్మాండముల సమూహం ఏకైక నియమము ననుసరించి ప్రవర్తిస్తున్నాయి. కొన్నిటిలో సృష్టియే లేదు. కొన్నిటిలో మానవులు మాత్రం లేరు. మిగతావన్నీ ఉన్నాయి. కొన్ని పాషాణములతో మాత్రమే నిండివున్నాయి. కొన్నిటినిండా క్రిములు మాత్రమే ఉన్నాయి. కొన్నికొన్ని కేవలం దేవతలతోను, మరికొన్ని కేవలం మనుష్యులతోను, ఇంకొన్ని ఈ రెండిటితోను నిండి ఉన్నాయి. కొన్నిట్లో చలనములేని జంతువులు మాత్రం ఉన్నాయి.
ఓ రాఘవా! ఇట్టివేయైన సృష్టులతో నిండిన బ్రహ్మాండములు ఇంకా అనేకం ఉన్నాయి. వాటివాటి వ్యవహారాదులు యోగుల ఊహలకు కూడా అందనంతటివి. అవన్నీ శూన్యమునందే ఉండి మహాకాశస్వరూపమై వ్యవహరిస్తున్నాయి. విష్ణువు మొదలైన దేవతలు కూడా తమ జీవితమంతా వెచ్చించినప్పటికీ వాటి పరిణామము తెలియజాలరు. ఆభరణములలో రత్నములు పొదగబడినట్లు, ఈ బ్రహ్మాండములలో 'భూతాకర్షణశక్తి' ఉన్నది. అందుచేతనే అవి జలము, జీవులు మొదలైన వాటిని కోల్పోకుండా ఉన్నాయి. ఓ మహామతీ! ఈ జగత్తుల విషయం నా దృష్టి పథంలో ఉన్నంతవరకు,
ఇక్కడ మనకు అవసరమైనంత వరకు వర్ణించాను. వాస్తవానికి వాటినన్నిటిని వర్ణించి నేను చెప్పలేను. ఎన్ని లక్షల, కోట్ల బ్రహ్మాండములు ఎన్నెన్ని విభేదములతో ఉన్నాయో. అదంతా భాషకు, భావానికి అందదని మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. #from yoga vasista