ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.
ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.
"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!
యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం
మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం
ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః
చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః
షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః
ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.
"క. ధీరవ్రత! రాజన్యకు
మారక! నీ హృదయమందు మసలిన కార్య
బారూఢిగా నెరుంగుదు
నారయనది పొందరానిదైనను నిత్తున్
వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారువేల యేండ్లు సనం బ్రాపింతువు."
దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.
భూ అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?
విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.