Tuesday, October 1, 2024

అక్షౌహిణి అంటే?

"అక్షౌహిణి అంటే?"
                 17-01-2024
ఒక యుగంలో లేదా ఒక కాలంలో ఆ ప్రజల జీవన విధానాలు మరియు ఆచార వ్యవహారాలతో పాటుగా అనేక అంశాలలో ఆ యుగం క్రొత్తయుగంలోకి అడుగుపెట్టే కొద్దీ మార్పులు రావడం సహజం. అలాగే సైన్య సంఖ్యా విషయంలో కూడా. అంటే కృతయుగానికి,త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి ఇలా ప్రతి యుగంలోనూ రాజులు సైన్యాన్ని ఏర్పరచి నియమిత సంఖ్యకు ఒక్కో పేరు పెట్టడం జరిగింది. కలియుగంలో ఆధునిక భావజాలం ప్రసరించింది. కాబట్టి ఇప్పటి సైన్యంలో అనేక రకాల స్థాయిలు వాటి సంఖ్య పరిమితి వాటి పేర్లు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి.ద్వాపరయుగంలో అంటే కురుక్షేత్ర యుద్ధకాలంలో కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం,పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం హోరాహోరీగా పోరాడినారు. శ్రీ మదాంధ్ర మహాభారతంలో నన్నయ వ్రాసిన ఆది పర్వంలోని ప్రథమాశ్వాసంలో భారత సంహిత నిర్మాణ ప్రశంస అనే విషయంలో 69వ పద్యం ఈ విషయాన్ని తెలుపుతున్నది.
సీసము:
వరరథమొక్కండు వారణమొక్కండు
     తురగముల్ మూఁడు కాల్వురునునేవు
రనుసంఖ్య గలయదియగుఁబత్తి యది
     త్రిగుణంబైన సేనాముఖంబు దీని
త్రిగుణంబైన గుల్మంబు,దీనిముమ్మడుఁగగు
      గణము తద్గణము త్రిగుణితమైన
వాహినియగు దానివడిమూట గుణియింపఁ
      బృతనాఁబరగుదత్ పృతనమూఁట
ఆటవెలది:
గుణితమైనఁజమువగున్ మఱిదాని ము
మ్మడుఁగనీకినీ సమాఖ్యనొనరు
నదియుఁబదిమడుంగులైన నక్షౌహిణి
యౌ,నిరంతరం ప్రమాను సంఖ్య.

1. వరరథం(శ్రేష్ఠమైన రథము)  1
    వారణము(ఏనుగు)             1
    తురగములు(గుఱ్ఱాలు)       3
    పదాతి(సైనికులు)               5
   ఈ మొత్తాన్ని"పత్తి" అంటారు.
2."పత్తి"ని మూడుచే గుణించగా వచ్చే 
    సైన్యం పేరు "సేనాముఖము".
   రథాలు                                3
   ఏనుగులు                            3
   గుఱ్ఱాలు                              9
   సైనికులు                            15
   ఈ మొత్తాన్ని "సేనాముఖము" అంటారు.
3."సేనాముఖము"ను మూడుచే గుణించగా
    వచ్చే సైన్యము పేరు "గుల్మం".
    రథాలు                              9
    ఏనుగులు                         9
    గుఱ్ఱాలు                         27
    సైనికులు                        45
    ఈ మొత్తాన్ని "గుల్మం" అంటారు.
4."గుల్మాన్ని" మూడు చేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "గణం".
    రథాలు        27
    ఏనుగులు    27
    గుఱ్ఱాలు       81
    సైనికులు    135
     ఈ మొత్తాన్ని " గణం" అంటారు. 
5."గణాన్ని" మూడుచే గుణిస్తే వచ్చే సైన్యము పేరు
   "వాహిని".
    రథాలు           81
    ఏనుగులు       81
    గుఱ్ఱాలు       243
    సైనికులు      405
    ఈ మొత్తాన్ని  "వాహిని" అంటారు.
6."వాహిని"ని మూడు చేత గుణిస్తే వచ్ఛే సైన్యము
    పేరు "పృతన".
    రథాలు            243
    ఏనుగులు        243
    గుఱ్ఱాలు          729
    సైనికులు        1215
    ఈ మొత్తాన్ని "పృతన" అంటారు.
7."పృతన"ను మూడు చేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "చమువు"
    రథాలు            729
    ఏనుగులు        729
    గుఱ్ఱాలు        2187
    సైనికులు       3645
    ఈ మొత్తాన్ని  "చమువు" అంటారు.
8."చమువు"ను మూడుచేత గుణించగా వచ్చే
    సైన్యము పేరు "అనీకిని".
    రథాలు            2187
    ఏనుగులు        2187
    గుఱ్ఱాలు           6561
    సైనికులు        10935
    ఈ మొత్తాన్ని " అనీకిని"అంటారు
9."అనీకిని"ని పది చేత గుణించగా వచ్చే సైన్యము
    పేరే "అక్షౌహిణి".
    రథాలు              21870
    ఏనుగులు          21870
    గుఱ్ఱాలు             65610
    సైనికులు          109350
    ఈ మొత్తాన్ని" ఒక అక్షౌహిణి "అంటారు.

      పై సమాచారాన్నిబట్టి పాండవుల వద్దగల 
     7 అక్షౌహిణుల సైన్యంలో గల రథ,గజ,తురగ
     పదాతుల సంఖ్య.
10.రథాలు            153090
      ఏనుగులు        153090
      గుఱ్ఱాలు           459270
      సైనికులు          765450
     ఈ మొత్తాన్ని"7అక్షౌహిణుల" సైన్యమంటారు.
     
     అలాగే కౌరవుల వద్ద గల 11అక్షౌహిణుల
     సైన్యంలో గల లథ,గజ,తురగ,పదాతుల
     సంఖ్య.
11.రథాలు                240570
      ఏనుగులు            240570
      గుఱ్ఱాలు               721710
      సైనికులు            1202850
     ఈ మొత్తాన్ని "11 అక్షౌహిణుల" సైన్యం
     అంటారు.
      పాండవుల,కౌరవుల మొత్తం 18 అక్షౌహిణుల
      మొత్తం సైన్యం.
      రథాలు               393660
      ఏనుగులు           393660
      గుఱ్ఱాలు           1180980
      సైనికులు          1968300
      పైన తెలుపబడిన సైనిక సంబంధ విషయాలు
      ద్వాపరయుగ భారతీయ సైన్య 
      సంబంధమేగాని విదేశీ సైనిక వ్యవస్థకు 
      వర్తించదు.            
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

No comments:

Post a Comment

శ్రీకృష్ణుని గొప్పదనం ఏమిటి?

అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రెండు రైల్వే లైన్లు పక్కపక్కనే ఉన్నాయి. అందులో ఒక లైన్ మీదనే రైళ్ళు నడుస్తాయి. రెండవది అసలు వాడకంలో లేదు. ఈ సంగతి ఊర్...