Sunday, October 6, 2024

వేదంలో సేద్యం

వేదంలో సేద్యం

శ్రీకృష్ణ యజుర్వేదంలో ఆహవనీయ చయనం కోసం భూమిని దున్నడం, విత్తనాలు నాటడం మొదలయిన విషయాలను పేర్కొనడం జరిగింది.

మూ : సంవరత్రా దధాతన నిరాహావాన్‌ కృణోతన. సించామహా అవట ముద్రిణం వయం విశ్వాహాదస్తమక్షితమ్‌

- శ్రీకృష్ణ సం. - 4 కాం ; 2 ప్ర. 5 అను. ; 5 ప.

(ఓ కర్షకులారా! నీళ్ళు తోడడానికి చర్మంతో చేసిన తాడు నూతి దగ్గర ఉంచండి. ఎడ్లు నీళ్ళు త్రాగడానికి తొట్టెలను ఏర్పరచండి. నూతుల్లో వేసవిలో కూడా నీరు ఎండిపోకుండా జల బాగా వచ్చేలా లోపలి బురద తొలగించాలి. నూతి గట్టులు పడిపోకుండా ఉండాలి.)

ఈ మంత్రంలో దున్నే సమయంలో ఎడ్లకు దప్పిక తీర్చడానికి ఏర్పాటు చెప్పబడింది. నోరులేని మూగ జీవాలకు మనం తోచిన సమయంలో నీరు త్రాగించడం కాక వాటికి దప్పిక కల్గినపుడు నీరు త్రాగడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేయడం సముచితం.
సీరా యుఞ్జన్తి కవయో యుగా వితన్వతే పృథక్‌ (పై గ్రంథం)

(వ్యవసాయ నిపుణులు నాగలిని కట్టుదురు గాక. వాటికి కాడులను విడివిడిగా అమర్చుదురు గాక.)

మూ : శునం నః ఫాలా వితుదన్తు భూమిగ్‌ం

శునం కీనాశా అభియన్తు వాహాన్‌

శునం పర్జన్యో మధునా పయోభి

శ్శునా సీరా శున మస్మాసు ధత్తమ్‌ -పై గ్రంథం - 6 పన.

(మాకు సుఖం కలిగేలా నాగళ్ళ కొనభాగాలు భూమిని బాగా దున్నాలి. కర్షకులు ఎడ్లను సుఖంగా నడిపించాలి. మేఘుడు మధుర రసంతో కూడిన నీటిని వర్షించాలి. వాయువు, ఆదిత్యుడు మాకు సుఖం కలిగించాలి.)

ఇలా వేదం యజ్ఞంలో దున్నే ప్రక్రియను సూచిస్తూ లోకంలో దున్నే ప్రక్రియను గూడా పేర్కొంది.

మూ : యజుషా యునక్తి యజుషా కృషతి వ్యావృత్యై

- శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

(యజ్ఞంలో మంత్రంతో నాగలిని కట్టాలి. మంత్రంతోనే దున్నాలి. లౌకికంగా నాగలి కట్టినపుడు, దున్నునపుడు మంత్రాలుండవు. వాటికంటే వీటికి భేదం ఉండడం కోసం యజ్ఞంలో మంత్రాలను వినియోగించాలి.)

మూ : షడ్గవేన కృషతి - శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

(ఆరు ఎడ్లను కట్టిన నాగలితో దున్నాలి.)

ఈ నాగలికి మూడు భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కాడి ఉంటుంది. ప్రతి కాడికి 2 ఎడ్లు ఉంటాయి.

మూ : యద్ద్వాదశ గవేన - పై గ్రంథం

12 ఎడ్లను కట్టిన నాగలితో గూడా దున్నవచ్చు. దీనికి 6 భాగాలుంటాయి. ప్రతి భాగంలో ఒక కాడి, ప్రతి కాడికి రెండేసి ఎడ్లను కట్టుతారు.


మూ : లాఙ్గలం పవీరవగ్‌ం సుశేవగ్‌ం సుమతిత్సరు. ఉదిత్కృషతి

- శ్రీ కృష్ణ సం. - 4 కాం. ; 2 ప్ర. ; 5 అను. ; 6 పన.

(వజ్రం వలె అతి తీక్షణమైన ఈ నాగలి పెద్ద మట్టిబెడ్డలు పైకి వచ్చేలా దున్నాలి. నాగలి బాగా పదునుగా ఉంది కనుక దీనివల్ల కర్షకులకు ప్రయాస ఉండదు. దీనిని కర్షకులు బాగుందని ప్రశంసిస్తారు. భూమి ఎత్తుపల్లాలుగా ఉండడం చేత ఈ నాగలి గమనం మధ్యలో విచ్ఛేదాన్ని పొందుతోంది.)

వేదంలో 14 రకాల ధాన్యాల ప్రసంగం వుంది.

మూ : చతుర్దశభి ర్వపతి సప్తగ్రామ్యా ఓషధయ స్సప్తారణ్యా ఉభయీషా మవరుద్ధ్యై

- శ్రీ కృష్ణ సం. - 5 కాం. ; 2 ప్ర. ; 5 అను.

(పదునాలుగు మంత్రాలతో విత్తనాలు నాటాలి. గ్రామాల్లో దొరికే ధాన్యాలు ఏడు. అడవులలో దొరికే ధాన్యాలు ఏడు. ఈ రెండు రకాల ధాన్యాలను పొందడానికి 14 మంత్రాలను వినియోగించాలి.)

నువ్వులు, మినుములు, వరి, యవలు, కొఱ్ఱలు, చిఱువడ్లు, గోధుమలు గ్రామాల దగ్గర పండించే ధాన్యాలు, వెదురు బియ్యం, చావలు, నెవ్వరి ధాన్యం, కారునువ్వులు, అడవి గోధుమలు, మర్కటకాలు, గార్ముతాలు, అడవి ధాన్యాలు.

దున్నే పద్ధతిని కల్ప సూత్ర మిలా పేర్కొంది.

''పుచ్ఛాచ్ఛిరోధికృషతి కామం కామదుఘేధుక్ష్వేతి ప్రదక్షిణ మావర్తయన్‌ తిస్రస్తిస్ర స్సీతా స్సంహితాః కృషతి మధ్యే సంభిన్నా భవన్తి దక్షిణా త్పక్షా దుత్తరస్మాత్‌ దక్షిణాయై శ్రోణ రుత్తర మంసముత్తరాయై దక్షిణమ్‌''

(''కామం కామదుఘేధుక్ష్వ' అనే మంత్రంతో తోక భాగం నుండి శిరో భాగం వరకు ప్రదక్షిణంగా తిరుగుతూ మూడు మూడు నాగేటి చాళ్ళు కలిగేలా దున్నాలి. ఈ చాళ్ళు దగ్గర దగ్గరగా ఉండాలి. ఈ చాళ్ళు మధ్యలో కలుస్తాయి. దక్షిణ పక్షం నుండి ఉత్తరం వైపు దక్షిణ శ్రోణి నుండి ఉత్తరాంసం వరకు దున్నాలి.)

దున్నవలసిన భూభాగాన్ని ఒక పక్షిలా భావించి దున్నే రీతి చెప్పారు. దాని తోక భాగం నుండి శిరోభాగం వైపు దున్నాలి. దక్షిణం రెక్క నుండి ఉత్తరం రెక్క వఱకు దున్నాలి. శ్రోణి అంటే పిఱుదు. అంసం అంటే భుజ శిరస్సు (మూపు). దక్షిణం పిరుదు నుండి ఉత్తర భుజశిరస్సు వరకు, ఉత్తరం పిఱుదు నుండి దక్షిణ భుజ శిరస్సు వరకు దున్నాలి. ఈ పద్ధతిని సంగ్రహంగా వేదం ఇలా సూచించింది.

మూ : తిస్ర స్తిస్ర స్సీతాః కృషతి (తోక నుండి శిరస్సు వరకు, దక్షిణం రెక్క నుండి ఉత్తర రెక్క వరకు, దక్షిణం పిఱుదు నుండి ఉత్తరం మూపు వరకు, ఉత్తరం పిఱుదు నుండి, దక్షిణం మూపు వరకు మూడు మూడు నాగేటి చాళ్ళను దున్నాలి. ఇలా మొత్తం 12 చాళ్ళు అవుతాయి.) - శ్రీ కృష్ణ సం. - కాం. 5 ; ప్ర. 2 ; అను. 5

ఇలా దున్ని విత్తనాలు నాటుతారు. అపుడు చెప్పే మంత్రాలలో ఓషధుల్ని మూలికల్ని వినియోగించి వైద్యం చేయడం సూచించబడింది.

మూ: య దోషధయ సృఙ్గచ్ఛస్తే రాజాన స్సమితావివ. విప్రస్స ఉచ్యతే భిషక్ రక్షోహామీ చాతనః

- సం. - కాం. 4; ప్ర. 2; అను. ; పన. 2

(రాజులు యుద్ధంలో శత్రువులను జయించడం కోసం కలిసినట్లు ఓషధులు పొలంలో ఫలమివ్వడం కోసం కలుస్తున్నాయి. వీటి రసం, వీర్యం, భావనం ఎరిగిన పురుషుణ్ణి భిషక్ అంటారు. ఇతడు పండిన ఓషధులతో పురోడాశాదులను తయారుచేసి రాక్షసుల వల్ల కలిగే ఉపద్రవ రూప మయిన రోగాలను తొలగిస్తాడు. ఓషధులతో పథ్యం ఏర్పరచి, దాని ద్వారా రోగాలను నాశం చేస్తాడు.)

ఇక్కడ ఓషధుల వల్ల రోగాలను నాశం చేయడం, పథ్యం ద్వారా రోగనాశం పేర్కొనబడ్డాయి. ఏ రోగానికి ఏది పథ్యమో ఏది అపథ్యమో ఆయుర్వేదం బాగా విస్తరించింది.

మూ యస్తే యక్ష్మం విబాధన్తా ముగ్రో మధ్యమశీరివ

సాకం యక్ష్మ ప్రపత శ్యేనేన కికిదీవినా

సాకం వాతస్య ధ్రాజ్యా సాకం నశ్య నిహాకయా

- . -5%. 4; 5. 2; . 6; 2. 4

(నీ శరీరాన్ని ఆక్రమించిన ఓషధుల రసరూపంలో ప్రతి పర్వలో ప్రవేశించి నీ రోగాన్ని విశేషంగా నాశం చేయుగాక. పక్షపాతం లేని రాజు దుష్టులను కఠినంగా శిక్షించినట్లు ఓషధులు రోగాలను నశింప జేయాలి. కంఠంలో శ్లేష్మం ఉండడం వల్ల కీ, కి అనే శబ్దం కలిగించే రోగం కికి దీవి. డేగవలె తీవ్రతరంగా ఉండే పిత్తం వల్ల కలిగే రోగం శ్యేనం. వీటితో గూడిన రాజయక్ష్మ రోగం నశించాలి. 'బాధతో చచ్చిపోతున్నాను. అయ్యో కష్టం' అని ఏడ్పించే రోగం నిహాక. దీనితో గూడిన రాజయక్ష్మ రోగం నశించాలి.)

మూ: మావో రిషత్ప్రనితా యసై#ద్మ చాహం ఖనామి వః

ద్విప చ్చతుష్ప దస్మాకగ్ం సర్వ మస్త్వనాతురమ్

(ఓషధులారా! చికిత్స కోసం మీ మూలాన్ని త్రవ్వేవాడు నశించకూడదు. ఏ రోగికి వైద్యం చేయడం కోసం నేను త్రవ్వుతున్నానో ఆ రోగి కూడా నశించకూడదు. మాకు సంబంధించిన ద్విపాదజీవులు (మానవాదులు) చతుష్పాదజీవులు (పశువులు) రోగం లేనివారు కావాలి. (పై గ్రంథం)

పై మంత్రాల వల్ల వేదంలో సేద్యం, 14 రకాలయిన ధాన్యాలను పండించడం, వ్రేళ్ళను, ఓషధులను రోగనివృత్తికి వినియోగించడం, 12 ఎద్దులు, 6 కాడులు ఉండే పెద్ద నాగళ్ళ వినియోగం ఉన్నాయని స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment

వేద విజ్ఞానం

3. వేద విజ్ఞానం వేదాలలో చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ ...