అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రెండు రైల్వే లైన్లు పక్కపక్కనే ఉన్నాయి. అందులో ఒక లైన్ మీదనే రైళ్ళు నడుస్తాయి. రెండవది అసలు వాడకంలో లేదు. ఈ సంగతి ఊర్లోని పెద్దలకు, పిల్లలకు, అందరకు తెలుసు. ఒకరోజు ఇరవై మంది పిల్లలు రైళ్లు ఎప్పుడూ నడిచే మార్గంలో ఆడుకుంటున్నారు. ఇద్దరబ్బాయిలు రైలు వాడకంలో లేని మార్గం మీద ఆడుకుంటున్నారు. రైలు శరవేగంతో వస్తోంది. రైలుని వాడకంలో లేని మార్గం పైకి మళ్లించే మీట మీ చేతిలో ఉంది. మీరేం చేస్తారు? రైలును ఎప్పుడూ వెళ్లే మార్గంలో వెళ్ళనిచ్చి యిరవై మంది పిల్లలను చావనిస్తారా, దారి మళ్లించి ఇద్దరు పిల్లల చావు మేలు అంటారా?
ఐదు నిమిషాలు ఆలోచించండి ఏ మార్గం మేలు? ఇరవై మంది మరణమా, ఇద్దరి మరణమా?
అయిదు వేల ఏళ్ల నాడు ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. సమాధానమిచ్చింది గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు. ధర్మ మార్గంలో వెళ్లే వారిని రక్షించాలి, అధర్మవర్తనులను అణిచేయాలి. రైలు వెళ్లే మార్గంలో ఆడుకోవడం తప్పు కాదా? ఆ మార్గంలో రైలు వెడుతుందని పిల్లలకు తెలుసు. అయినా తప్పు చేశారు.
దుర్యోధనుడు అదే మాట అన్నాడు. "నాకు ఏది ధర్మమో తెలుసు. అయినా మనసు ధర్మం పైకి పోదు. ఏది అధర్మమో తెలుసు, అయినా మనసు దానివైపే పోతుంది." నిర్ణయం తీసుకోవలసింది సంఖ్యాబలాన్ని బట్టి కాదు. ధర్మ ప్రవర్తనను బట్టి రక్షణను చేపట్టాలి. కౌరవులను శిక్షించి ధర్మమార్గంలో వెళ్లే ఐదుగురు పాండవులను రక్షించాడు. ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మపక్షమే ఉండమని మనకు ఆదేశం ఇచ్చాడు.
ఇప్పుడు మీకు ఏ మార్గం అవలంబించాలన్న దానికి గీతాచార్యుల నుంచే సమాధానం లభించింది కదా. ఇద్దరే కావచ్చు కానీ వాడకంలో లేని రైలు మార్గం పై ఆడుకుంటున్న పిల్లలు తప్పు చేయలేదు. వారిని రక్షించడమే సరైన పని.
రైలు మార్గాల ప్రశ్న కల్పితమే కానీ జీవితంలో ఎన్నో సందర్భాలలో మంచి వారి వైపు నిలబడవలసిన పరిస్థితులు కుటుంబాలలో, రాజకీయాలలో ఎదురవుతాయి. ఇంట్లో నలుగురు కొడుకులలో ఒకడు కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఆర్జనపరుడు కావచ్చు. మిగిలిన ముగ్గురూ కష్టపడకుండా ఆవారాగా తిరుగుతూ ఉండొచ్చు. కష్టపడి పైకి వచ్చిన వాడిని మిగిలిన ముగ్గురి పోషణ బాధ్యత స్వీకరించమనడం న్యాయమా?
కష్టపడి పని చేసి సంపాదించి పన్నులు కట్టేవారు కొందరయితే ప్రభుత్వం అమలు పరిచే ఉచిత పథకాలు అనుభవిస్తూ దేశాభివృద్ధికి ఏ మాత్రం పాటు పడని వారు మరెందరో. రాజకీయ నాయకులు ఆలోచించ వలసిన విషయం ఇది.
పరిపాలన చేసేటప్పుడు దేశాధినేతకు ఏ మార్గం అవలంబించాలన్న సందేహం కలిగే సన్నివేశాలు ఎన్నో ఎదురవుతాయి. అధర్మ మార్గంలో వెళ్లేవారు ఎక్కువ ఉండవచ్చు. ఆ మార్గంలో వెళ్లి తీరా శిక్ష పడుతున్నప్పుడో, పడినప్పుడో, పడుతుందన్న భయం కలిగినప్పుడో కన్నీటిగాథ వినిపించి ప్రజలను తమ వైపు తిప్పుకుని క్షమాభిక్ష కోరేవారు అనేకులు. అయ్యో పాపం వారిని వదిలేయాలి అనేవారు కోకొల్లలు.
శిక్షార్హులను వదిలేయడాన్ని మించిన పాపం లేదు. రథచక్రం కూరుకుపోయినప్పుడు ధర్మ ప్రసంగం మొదలెట్టిన కర్ణుని శ్రీకృష్ణుడు అనేక సందర్భాలలో నీకు ధర్మం గుర్తు రాలేదా అని ప్రశ్నించాడు. నేటి దేశాధినేతలు గుర్తుంచుకోవలసిన విషయం ఇది.
అత్యధికుల మార్గమే అనుసరణీయం కాదు. సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ధర్మసంస్థాపనకై తాను అవతరించినానని గీతాచార్యుడు చెప్పి ఆచరించి చూపాడు.
ఆయన బోధనలను తెలుసుకొని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి.
మెజారిటీ చెప్పినదే సరి అని అనుకోరాదు.
కృష్ణం వందే జగద్గురుం
No comments:
Post a Comment