జనమేజయా ! కృతయుగంలో జన్మించి పుణ్యకర్మలు ఆచరించినవారు జన్మపరంపరాబంధం నుంచి విముక్తులై దేవలోకాలకు వెళ్ళిపోయారు. చతుర్వర్ణాలవారూ స్వధర్మనిరతులై సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకుని ఆయా ఉత్తమలోకాలకు తరలిపోతారు. రజకాది వర్ణాలవాట సత్యమూ, దయ, దానమూ, ఏకపత్నీవ్రతమూ, అద్రోహమూ (ద్రోహచింత లేకపోవడం), సర్వప్రాణి సమానత్వమూ వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుకుంటారు. ఇది సత్యయుక్త లక్షణం. త్రేతా ద్వాపరాలలోకూడా ఇంతే. ఈ కలియుగంలోమాత్రం పాపిష్ఠులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంతవరకూ ఆయాలోకాలలో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవలోకంలో జన్మిస్తుంటారు. కలియుగం ముగిసి మరొక్కసారి సత్యయుగం ప్రారంభంకాగానే అప్పటి ఆ ధర్మాత్ములూ పుణ్యాత్ములూ స్వర్గం నుంచి మానవులై భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలుకాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమికి దిగుతారు. ఇది కాలసమాచారం. దీనికి తిరుగులేదు. తెలుసుకో. అందుచేత కలియుగం పాపకూపం. ప్రజలుకూడా అలాగే దానికి తగ్గట్టు
ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొందరు జీవులకి యుగవ్యత్యయు వస్తుంది. క్రిందటి కలియుగంలో సజ్జనులై జీవయాత్ర సాగించినవారు మరుసటి కల్పన ద్వాపరంలో జన్మిస్తుంటారు. అలాగే కొందరు త్రేతాయుగంలోకీ మరికొందరు సత్యయుగంలోకీ (కృత) మారుతుంటారు. సత్యయుగంలో జన్మించి దుష్టులుగా మారినవారు అనంతరకల్పన కలియుగంలోకి దిగిపోతుంటారు. సంచితకర్మ ప్రభావంవల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావంవల్ల అవే పాపాలు మళ్ళీ ఆచరిస్తుంటారు. అంచేత జనమేజయా ! అప్పటి పుణ్యాత్ములు ఇప్పుడు కనపడరు. ఇప్పటి పాపాత్ములు అప్పుడు వినపడరు. యుగధర్మాల లక్షణం ఇది. తెలిసిందా ?
పితామహా ! చాలావరకూ అర్థమయ్యింది. అయితే ఆ యుగధర్మాలు ఏమిటో మరింత
వివరంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవా !
No comments:
Post a Comment